కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌తో మాకు సంబంధం లేదు: రిల‌యన్స్

-

కేంద్రం అమ‌లులోకి తెచ్చిన 3 వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పంజాబ్‌, హ‌ర్యానాల‌కు చెందిన రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళ‌నలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఆందోళ‌న‌ల్లో భాగంగా కొంద‌రు వ్య‌క్తులు రెండు రాష్ట్రాల్లోని టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియోకు చెందిన సెల్‌ఫోన్ ట‌వ‌ర్లు, ఇత‌ర ఆస్తుల‌ను పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో రిల‌య‌న్స్ సంస్థ ఈ విష‌యంపై రెండు రాష్ట్రాల‌కు చెందిన హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆయా రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌భుత్వాలు ఈ విష‌యంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వెంట‌నే దోషుల‌ను ప‌ట్టుకుని క‌ఠినంగా శిక్షించేలా చూడాల‌ని కోరింది.

reliance clarified that they have nothing to do with new farm bills

రిలయ‌న్స్ ఇండ‌స్ట్రీస్ లేదా జియో లేదా ఇత‌ర రిల‌య‌న్స్‌కు చెందిన ఏ సంస్థ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల్లో భాగంగా రైతుల‌తో కాంట్రాక్టు వ్య‌వ‌సాయానికి ఒప్పందాలు చేసుకోలేద‌ని, అలాగే ఆ రెండు రాష్ట్రాల్లోనే కాక దేశంలో ఎక్క‌డా కూడా వ్య‌వ‌సాయం కోసం ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం భూమిని కూడా తాము కొనుగోలు చేయ‌లేద‌ని, అందువ‌ల్ల ఆ మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని రిల‌య‌న్స్ తెలిపింది. త‌మకు భ‌విష్య‌త్తులో ఈ రంగంలోకి ప్ర‌వేశించే ఉద్దేశం కూడా లేద‌ని తెలిపింది.

ఇక కొంద‌రు వ్య‌క్తులు చేస్తున్న దుష్ప్ర‌చారం వ‌ల్లే ఆ రెండు రాష్ట్రాల్లోని త‌మ ఆస్తుల‌ను ధ్వంసం చేస్తున్నార‌ని, నిజానికి వ్యవ‌సాయ చ‌ట్టాల‌కు, త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని రిల‌య‌న్స్ తెలియ‌జేసింది. అలాగే రిల‌యన్స్ జియో ఎంతో మందికి సేవ‌లందిస్తుంద‌ని, దేశాన్ని డిజిట‌ల్ మ‌యంగా చేయ‌డానికి పాటు ప‌డుతుంద‌ని, ఆ రెండు రాష్ట్రాల్లో జియోకు దాదాపుగా 2.50 కోట్ల మంది వ‌ర‌కు వినియోగ‌దారులు ఉన్నార‌ని, జియో ఆస్తుల‌ను ధ్వంసం చేయ‌డం వ‌ల్ల వినియోగ‌దారుల‌కు సేవ‌లను అందించేందుకు ఆటంకం క‌లుగుతుంద‌ని తెలిపింది. త‌మ‌కు ఎలాంటి సంబంధం లేకపోయినా జియో ఆస్తుల‌ను ధ్వంసం చేస్తున్నార‌ని, ఇది స‌రికాద‌ని, క‌నుక ఆ రెండు రాష్ట్రాలు స‌త్వ‌ర‌మే ఈ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, త‌మ ఆస్తుల‌ను ధ్వంసం చేసిన వారిని గుర్తించి క‌ఠిన చ‌ర్య‌లు తీసునేలా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలను ఆదేశించాల‌ని రిల‌య‌న్స్ సంస్థ హైకోర్టుకు విజ్ఞ‌ప్తి చేసింది. సోష‌ల్ మీడియాలో త‌మ గురించి వ‌చ్చే పుకార్ల‌ను కూడా న‌మ్మ‌వ‌ద్ద‌ని రిల‌య‌న్స్ కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news