కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మెప్పాడి ఆస్పత్రిలోనే 18 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బందికి తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. చురల్మల వద్దనున్న ఏకైక వంతెన, ప్రధాన రహదారి ధ్వంసం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. 250 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ముండకై ఆవలవైపు సహాయక చర్యలు చేపడుతున్నారు. సైన్యం ఇక్కడ తాత్కాలిక వంతెనను నిర్మిస్తే ఆ ప్రాంతానికి చేరుకొని చర్యలు చేపట్టనున్నారు. అసలు ఆ గ్రామంలో పరిస్థితి ఏమిటనేది ఇప్పటివరకు పూర్తి సమాచారం తెలియడం లేదు.
మరోవైపు వయనాడ్‌లో సహాయక చర్యలు చేపట్టేందుకు కన్నూర్‌లోని డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ నుంచి రెండు వరద సహాయక కాలమ్స్‌ను వయనాడ్‌కు తరలించారు. బెంగళూరు నుంచి ఆర్మీ ఇంజినీర్ కోర్ బృందం బయల్దేరింది. కొండచరియల తొలగింపు, తాత్కాలిక నిర్మాణాల్లో నైపుణ్యం కలిగిన ఈ టీమ్ త్వరలోనే వయనాడ్ చేరుకోనుంది.