శబరిమల అయ్యప్ప భక్తులకు అలర్ట్ శబరిమల ఆలయాన్ని బుధవారం రాత్రి మూసివేశారు. ఆలయంలో 41 రోజుల పాటు జరిగిన మండల దీక్ష పూజలు పూర్తి కావడంతో బుధవారం రాత్రి ఆలయ అర్చకులు హరివరాసనం ఆలపించి ఆలయాన్ని మూసివేశారు. మకరవిళుక్కు ఉత్సవం కోసం డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం అయ్యప్ప ఆలయాన్ని మళ్లీ తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మండల దీక్ష సీజన్లో శబరిమల ఆలయానికి రూ.241.71 కోట్లు ఆదాయం సమకూరినట్లుగా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ వెల్లడించింది.
గత ఏడాది మండల దీక్ష సీజన్లో రూ. 222.98 కోట్ల ఆదాయం సమకూరినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ ప్రెసిడెంట్ పీఎస్ ప్రశాంత్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రూ. 18.72 కోట్లు అదనపు ఆదాయం వచ్చినట్లు చెప్పారు. భక్తుల కానుకలు సహా వివిధ ఆదాయ మార్గాల ద్వారా ఈ మొత్తం సమకూరినట్లుగా ట్రావెన్కోర్ బోర్ట్ ప్రెసిడెంట్ వెల్లడించారు. మరోవైపు శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకోసం కేరళ సర్కార్ అయ్యన్(Ayyan App) యాప్ను కొద్ది రోజుల క్రితం అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.