ఈ రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేస్తామని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టి ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించామని చెప్పారు. ప్రజల దగ్గరకు వెళ్లి ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి చేస్తున్న కార్యక్రమమే ‘ప్రజాపాలన’ అని తెలిపారు. కాంగ్రెస్ది ప్రజల ప్రభుత్వం.. దొరల ప్రభుత్వం కానే కాదని స్పష్టం చేశారు. ప్రజల దగ్గరకే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని వెల్లడించారు.
“వంద కుటుంబాలకు ఒక కౌంటర్ పెట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం మనది. ప్రజాపాలన అందిస్తామని చెప్పి ప్రజలను ఒప్పించి ప్రభుత్వం ఏర్పాటు చేశాం. మేం ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నాం. పదేళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదు. నేను పాదయాత్ర చేస్తున్న సమయంలో మహిళలు వారి సమస్యలు చెప్పుకున్నారు. గతంలో కాంగ్రెస్ పంచిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంది. తొమ్మిదేళ్లలో ఒక రేషన్ కార్డుకు దరఖాస్తు తీసుకోలేదు.” అని గత బీఆర్ఎస్ సర్కార్పై భట్టి మండిపడ్డారు.