భారతీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్ శామ్ పిట్రోడా ఆ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. శామ్ పిట్రోడాను తిరిగి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేశారు.
గత నెలలో దక్షిణ భారతీయులను ఆఫ్రికన్లతో పోలుస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘స్టేట్స్‌మన్’ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సామ్ పిట్రోడా మాట్లాడుతూ.. “మనది వైవిధ్యమైన దేశం. తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బులుగా కన్పిస్తారు. ఇక ఉత్తరాది వాళ్లు శ్వేతజాతీయులుగా, దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారు. ఇవన్నీ ఎలా ఉన్నా మనమంతా సోదరసోదరీమణులమే. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్రం మన మూలాల్లో పాతుకుపోయాయి” అని పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి.