48 గంటల్లో పోలింగ్ శాతం వెల్లడించాలి.. ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశం

-

పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటింగ్‌ శాతాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ప్రచురించాలని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై మే 24న మళ్లీ విచారణ జరుపుతామని పేర్కొంది. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో పోల్‌ అయిన ఓట్ల సంఖ్యను విడివిడిగా ఫారం-17 సి పార్ట్‌ 1 స్కాన్డ్‌ ప్రతుల రూపంలో పొందుపరిచేలా చేయాలని, ఈ మేరకు ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏడీఆర్‌ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది.

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న ముగిసినా, పోలైన ఓట్ల సంఖ్యను 11 రోజుల తరవాత ఏప్రిల్‌ 30న ప్రచురించారు. ఏప్రిల్‌ 26న జరిగిన రెండో దశ పోలింగ్‌ శాతాన్ని నాలుగు రోజుల తరవాత అందుబాటులో ఉంచారు. పోలింగ్‌ రోజున ఎన్నికల సంఘం వెల్లడించిన ఓటింగ్‌ శాతం కన్నా అయిదారు శాతం ఎక్కువగా ఏప్రిల్‌ 30న గణాంకాలు కనిపించడంతో అనుమానాలు తలెత్తుతున్నాయని ఏడీఆర్‌ తమ పిటిషన్‌లో పేర్కొంది. దేశంలో జరిగే తదుపరి దశ ఎన్నికలు ముగిసిన 48 గంటల్లోగా నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల సంఖ్యను బహిరంగంగా వెల్లడించాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news