తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి పదేళ్లు పూర్తి కానున్నందున, పునర్విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. పునర్విభజన చట్టంలోని షెడ్యూలు 9, 10లోని వందకుపైగా ఆస్తుల విభజన, హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాల స్వాధీనం, బకాయిల వివాదాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు రైతు రుణమాఫీపై కూడా మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. సుమారు 42 లక్షల మంది రైతులకు రుణమాఫీకి సుమారు రూ.32,000 కోట్ల నిధులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంతో పాటు విధివిధానాలపై అధికారులకు మంత్రివర్గం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు వనరుల సమీకరణ, ప్రత్యామ్నాయ, నూతన మార్గాల అన్వేషణపై కేబినెట్ లో చర్చ జరగనుంది. ధాన్యం కొనుగోళ్లపై కూడా రాష్ట్ర కేబినెట్ సమీక్షించనుంది