లోక్‌సభ ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకీ మోత మోగింది. కాంకేర్, నారాయణ్‌పుర్ జిల్లాల సరిహద్దు దద్దరిల్లింది. ఈరోజు ఉదయం నక్సల్స్, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ హతమయ్యారు. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్‌మేట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నక్సల్స్ నక్కినట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందగా.. స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్‌జీ దళాలు సంయుక్తంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి.
సోమవారం రాత్రి నుంచే గాలింపు చేపట్టిన ఈ బృందాలు.. మంగళవారం ఉదయం నక్సల్స్ ఉన్న ప్రాంతానికి చేరుకోగా వీరిని చూసిన నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా దళాలు నలుగుర్ని మట్టుబెట్టాయి. మరికొందరు పరారైనట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.