శశికళ జైలు నుంచి త్వరలో విడుదల కాబోతున్నారు. ఈ మేరకు కోర్టుకు జరిమానా చెల్లించి రశీదులకు పరప్పన అగ్రహార చెరకు చిన్నమ్మ శశికళ తరఫున న్యాయవాదులు పంపించినట్లు సమాచారం. ఈ మేరకు ఆమె రూ.10 కోట్ల 10 లక్షల జరిమానాను కోర్డుకు చెల్లించారు. అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న శశికళ జనవరిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త నరసింహన్ సమాచార హక్కు చట్టం కింద శశికళ విడుదల తేదీపై స్పష్టత ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు జైళ్ల శాఖ వచ్చే ఏడాది జనవరి 27వ తేదీ విడుదల కానున్నట్లు తెలిపారు.
2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందే శశికళ విడుదల కాబోతున్నట్లు అన్నాడీఎంకే పార్టీ చర్చలు తప్పడం లేదు. చిన్నమ్మ విడుదలను అడ్డుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీంతో శశికళ తరఫు న్యాయవాది రాజా చెందూర్ పాండియన్ మాత్రం చిన్నమ్మ విడుదలను ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. చిన్నమ్మ పెరోల్ పై బయటకు వచ్చిన రోజులను మినహాయించి సత్ప్రవర్తన కింద 120 రోజుల ముందే శశికళ విడుదల అవుతారని తెలిసి అభిమానుల్లో పట్టరాని సంతోషం నెలకొంది.
రాజా చెందూర్ పాండియన్ ఆదివారం బెంగళూరుకు వెళ్లారు. చిన్నమ్మకు కోర్టు విధించిన జరిమానా చెల్లింపు పనిలో నిమగ్నమయ్యారు. బెంగళూరుకు చెందిన న్యాయవాది ముత్తుకుమార్ తో కలిసి రూ.10 కోట్ల 10 లక్షలను మంగళవారం సంబంధిత కోర్టులో చెల్లించారు. అనంతరం డీడీ రూపంలో రశీదును అందుకున్నారు. ఈ మేరకు రశీదు బుధవారం ఉదయమే రావడంతో పాండియన్ పరప్పన అగ్రహార చెరకు లేఖ కూడా పంపారని సమాచారం.
ఈ మేరకు రాజా చెందూర్ పాండియన్ మాట్లాడుతూ.. ‘‘చిన్నమ్మ విడుదలకు సంబంధించి అన్ని ప్రక్రియలు సజావుగా సాగుతున్నాయి. ఒకటి, రెండ్రోజుల్లో విడుదలయ్యేందుకు ఛాన్స్ ఉంది. ముందుగానే విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి.’’ అని ధీమా వ్యక్తం చేశారు.