సిక్కింలో ఆకస్మిక వరదలు విలయం సృష్టించాయి. ఆ రాష్ట్రంలో మెరుపు వరదల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఈ వరదల్లో 14 మంది దుర్మరణం చెందారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ వరదల్లో 22 మంది జవాన్లు సహా 102 మంది గల్లంతయ్యారు. భారీ వరదలతో ఆ రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు ప్రాంతంలో కురిసిన వర్షానికి వాగులు, వంకలు, సరస్సులు పోటెత్తాయి. లాంచెన్ లోయలోని తీస్తా నదిలో.. వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో.. చుంగ్ తాంగ్ డ్యాంలోకి వరద ప్రవాహం పెరిగింది. దీంతో నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాలు వరద గుప్పిట చిక్కాయి. వరద ఉద్ధృతికి సింగ్ తామ్ సమీపంలోని.. బర్దంగ్ ప్రాంతంలో సైనిక శిబిరాలు కొట్టుకుపోయినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. పార్కింగ్‌లో ఉంచిన 41 సైనిక వాహనాలు మునిగిపోయాయి.
చుంగ్ తాంగ్ డ్యాం నుంచి.. ముందస్తు సమాచారం లేకుండా నీటిని విడుదల చేయటమే ఈ ప్రమాదానికి కారణమని స్థానిక అధికారులు అంటున్నారు. సిక్కిం సీఎం పీఎస్ తమంగ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.