భారత ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మే 31వ తేదీకి ఒకటీ రెండు రోజులు అటు ఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు ప్రకటించింది. లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు – సెప్టెంబరు కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావొచ్చని గత నెలలో వాతావరణ శాఖ వెల్లడించింది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని ఇప్పుడు తెలిపింది.
వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్‌లో విత్తనాలు వేసే జూన్, జులై నెలలు చాలా కీలకమని సంబంధిత శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అన్నారు. ఈ ఏడాది సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాల సీజన్‌లో 106 శాతం వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. లానినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉండడం వల్ల ఆగస్టు- సెప్టెంబరు నాటికి ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది. వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.