పాకిస్థాన్ పార్లమెంటులో మరోసారి భారతదేశ ప్రస్తావన వచ్చింది. ఇప్పటికే పలుమార్లు భారతదేశ అభివృద్ధిని ఆ దేశ ప్రధాని ప్రస్తావిస్తూ పాకిస్థాన్ దుర్భర పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పాక్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం ఇంకా మురుగు కాలువల్లో పిల్లల మరణాలనూ నివారించలేక పోతోందంటూ పార్లమెంటు సాక్షిగా వాపోయారు. ఆయన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చంద్రుడిపై భారత్ కాలుమోపినట్లు టీవీలో వార్తలు వచ్చాయని, ఆ తర్వాత రెండు సెకన్లలోనే అదే తెరపై కరాచీలో పిల్లలు మురుగు కాలువల్లో పడి మరణించిన సమాచారం వచ్చిందని ముస్తఫా అన్నారు. పాకిస్థాన్‌కు కరాచీ ప్రధాన ఆదాయ వనరు అని, రెండు నౌకాశ్రయాలు ఉన్నాయని, దేశానికి ఈ నగరం ముఖద్వారం వంటిదని పేర్కొన్నారు. కానీ, 15 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో తాగునీరు కూడా అందడం లేదని, వచ్చిన కొద్దిపాటి నీటిని కూడా మాఫియా అక్రమంగా విక్రయిస్తోందని వాపోయారు. దేశంలో 2.62 కోట్ల మంది పిల్లలు పాఠశాలకు వెళ్లడం లేదు అంటూ పాక్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను సయ్యద్ ముస్తఫా వివరించారు.