వచ్చేశాయి.. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. ఆదివారం రోజున దేశంలోని నికోబార్ దీవులపైకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. ఈ నెల 31వ తేదీ వరకు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నికోబార్ దీవులు సహా మాల్దీవులు, దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు చేరుకున్నాయని పేర్కొన్నారు.
ఈ రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసిన విషయం తెలిసిందే. వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఐఎండీ ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. అత్యంత తొందరగా 1918లో మే 11న.. అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18న ప్రవేశించాయి. ఇక గతేడాది జూన్ 8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న కేరళ తీరాన్ని తాకాయి.