అయోధ్యలో ఈనెల 22న శ్రీరాముడి విగ్రహం ప్రతిష్టించనున్నారు. ఈ సందర్భంగా రిజర్వ్ బ్యాంకు రాముడు, అయోధ్య ఆలయ ఫోటోలతో కొత్త రూ. 500 నోటు విడుదల చేయనుందని ప్రచారం జరుగుతుంది. రాముడు, రామాలయం ఫోటోలతో కూడిన రూ. 500 నోటు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది దీన్ని షేర్ చేస్తున్నారు. అయితే ఇది ఫేక్ నోటు అని తెలుస్తోంది. దీనిపై రిజర్వ్ బ్యాంకు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
కాగా, అయోధ్య రామ్మందిర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తోంది. ఇప్పటికే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన క్రతువులు అయోధ్యలో మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సరయు నది ఘాట్ వద్ద హారతి కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రాల నడుమ అర్చకులు సరయు నదికి హారతి ఇచ్చారు. ఈ వేడుకను చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఘాట్ వద్ద దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మరోవైపు ఈ క్రతువుల్లో భాగంగా శ్రీరాముడికి కానుకగా వచ్చిన బాహుబలి అగర్బత్తిని కూడా వెలిగించారు.