పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి ఫైర్ అయింది. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో గత ఉత్తర్వుల్లో న్యాయస్థానం ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు కాదంటూ మండిపడింది. ఈ వ్యవహారంలో తమ తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు నేటి విచారణకు కూడా రాందేవ్ బాబా, బాలకృష్ణ వ్యక్తిగతంగా హాజరై వీరిద్దరూ న్యాయస్థానంలో మరోసారి బేషరతుగా క్షమాపణలు తెలియజేశారు. “ఆ సమయంలో మేము చేసింది తప్పిదమే.” అని అత్యున్నత ధర్మాసనానికి రాందేవ్ బాబా, బాలకృష్ణ తెలిపారు.
అయితే రాందేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ వివరణపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ.. వారం రోజుల్లోగా దీనిపై బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వండి” అని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.