దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. వందల కుటుంబాల్లో విషాదం నింపిన గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి ఘటనపై ఈనెల 14న సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో న్యాయవాది విశాల్ తివారి సోమవారం రోజున పిటిషన్ దాఖలు చేశారు.
వంతెన కూలిన ఘటనలో 130మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని.. ఈ ప్రమాదం అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యాన్ని చూపిస్తోందని ఆరోపించారు. మరమ్మతు తర్వాత వంతెనను తిరిగి ప్రారంభించిన సమయంలో ప్రైవేట్ ఆపరేటర్ అధికారుల నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోలేదని, అధికారుల పర్యవేక్షణ కొరవడిందని పిటిషన్లో పేర్కొన్నారు. భద్రతపై ఎలాంటి శ్రద్ధ చూపకపోవడం భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘన అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును ఉల్లంఘించడమేనని కోర్టుకు వివరించారు.
భవిష్యత్లో ప్రాణనష్టం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, పురాతన, ప్రమాదకర స్మారక చిహ్నాలు, వంతెనలు వంటి వాటి వద్ద ప్రమాదాన్ని అంచనా వేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అలాగే ఇలాంటి కేసులలో సత్వర దర్యాప్తు కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. న్యాయవాది విశాల్ తివారి దాఖలు చేసిన ఈ పిటిషన్పై ఈనెల 14న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది.