దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదంలో గాయపడిన వారికి సత్వరమే చికిత్స అందించేలా మార్గదర్శకాలు రూపొందించాలని పేర్కొంది. ఆరు నెలలోగా ఈ మార్గదర్శకాలు రూపొందించాలని జస్టిస్ అభయ్ ఒకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.
మరోవైపు డ్రైవర్లకు పనిగంటల విధానం అమలుపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వ శాఖకు సుప్రీంకోర్టు సూచనలు చేసింది. రోజు జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిలో చాలా మందికి సత్వరం చికిత్స అందడం లేదని తెలిపింది. చాలా ప్రమాదాల్లో క్షతగాత్రులు చాలా సేపటి వరకు వాహనాల్లోనే చిక్కుకుపోయి నరకం అనుభవిస్తున్నారని పేర్కొంది. అందుకే వీరికి వేగంగా సాయం అందే విధంగా ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం నిబంధనలు రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.