పిల్లల దత్తతపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైవాహక స్థితితో సంబంధం లేకుండా వ్యక్తులెవరైనా పిల్లల్ని దత్తత తీసుకునేందుకు మన చట్టాలు అనుమతిస్తున్నాయని పేర్కొంది. స్వలింగ సంపర్కులైనా ఇలా దత్తత తీసుకోకుండా నిరోధించలేమని తెలిపింది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. స్వలింగ వివాహాలకు చట్టబద్ధ గుర్తింపునివ్వడంపై విచారణను తొమ్మిదో రోజైన బుధవారం కొనసాగించింది.
‘జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్’ (ఎన్‌సీపీసీఆర్), ‘కారా’ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. ‘అన్నింటికన్నా పిల్లల సంక్షేమం ముఖ్యం. పిల్లల్ని దత్తత తీసుకోవడం ప్రాథమిక హక్కు కిందికి రాదని గతంలో పలు తీర్పులు పేర్కొన్నాయి. సహజంగా స్త్రీ-పురుషులకు పుట్టిన పిల్లల సంక్షేమం మీద, వారి ప్రయోజనాల పరిరక్షణమీదే మన చట్టాలన్నీ దృష్టి సారించాయి. వేర్వేరు లింగాల జంటలను, స్వలింగ సంపర్కులను భిన్నంగా పరిగణిస్తూ వస్తున్నారు’ అని ఆమె తెలిపారు.
పిల్లల సంక్షేమమే పరమావధి అనే విషయంలో సందేహమేమీ లేదని ధర్మాసనం స్పందించింది. వైవాహక స్థితితో సంబంధం లేకుండా వ్యక్తులెవరైనా పిల్లల్ని దత్తత తీసుకునేందుకు మన చట్టాలు అనుమతిస్తున్నాయని స్పష్టం చేసింది.