ప్రాజెక్టు చీతా విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరును ప్రశ్నించలేం అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. విదేశాల నుంచి చీతాలను తీసుకొచ్చి.. భారత్‌లో ప్రవేశపెట్టేందుకు సర్కారు తీసుకుంటున్న చర్యలను ప్రశ్నించేందుకు సహేతుక కారణాలేవీ లేవని న్యాయస్థానం పేర్కొంది. నిపుణుల సూచనలు తీసుకుంటూ మరణాలను నివారించేందుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి తీసుకొచ్చిన చీతాల వరుస మరణాల నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం రోజున విచారణ చేపట్టి కొట్టివేసింది.
అంతకుముందు.. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. కునో పార్కులో చీతాల మరణాలు ఇబ్బందికరమే కానీ మరీ ఆందోళనకరమేమీ కాదని కోర్టుకు తెలిపారు. వేట, విషప్రయోగం, రోడ్డుప్రమాదాలు, విద్యుదాఘాతం వంటి అసహజ కారణాలతో చీతాలేవీ మరణించలేదని స్పష్టం చేశారు. ఆఫ్రికాలో వచ్చే శీతాకాలాన్ని ఊహించుకొని.. కునోలో చీతాలు చలి నుంచి రక్షణ కోసం వాటికవే శరీరంపై సహజసిద్ధ ‘చలికాలపు దుప్పటి’ని ఏర్పరుచుకుంటున్నాయని ఆమె తెలిపారు. కునోలో 45-46 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నవేళ ఇలా జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు.