వివాహేతర సంబంధాలతో జన్మించిన సంతానం ఆస్తి హక్కులపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. అనైతిక సంబంధాల వల్ల జన్మించిన సంతానానికి హిందూ చట్టాల ప్రకారం.. తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందా అనే అంశంపై దాఖలైన పిటిషన్పై శుక్రవారం రోజున సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. చెల్లుబాటు కాని లేదా రద్దు చేయదగ్గ వివాహాల ద్వారా పుట్టిన పిల్లలు చట్టబద్ధమైన వారసులేనని స్పష్టం చేసింది.
హిందూ వారసత్వ చట్టం కింద హిందూ అవిభాజ్య కుటుంబంలో తల్లిదండ్రులకు వచ్చే పూర్వీకుల ఆస్తిలో ఈ పిల్లలు కూడా వాటా పొందేందుకు హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. 2011 నుంచి పెండింగులో ఉన్న ఈ అభ్యర్థనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. గతంలో సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ప్రస్తుత సీజేఐ ధర్మాసనం విభేదిస్తూ.. చెల్లుబాటు కాని.. లేదా రద్దు చేయదగ్గ వివాహాల నుంచి పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల పూర్వీకుల ద్వారా వచ్చిన వారసత్వ ఆస్తిలో వాటా ఉంటుందని పేర్కొంది.