తమిళనాడు బీజేపీ చీఫ్‌గా అన్నామలై వారసుడిగా నైనార్ నాగేంద్రన్ రానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చెన్నైలో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా .. అన్నామలై వారసుడిని శనివారం రోజున అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై ఉన్న సమయంలో జయలలితపై చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల అన్నాడీఎంకేతో బీజేపీ సంబంధాలు తెగిపోయాయి.
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్నాడీఎంకేతో సంబంధాలు ముఖ్యం కావడంతో ఆ పార్టీ మద్దతు బీజేపీకి అవసరం. ఈ నేపథ్యంలో దీనికి అడ్డంకిగా ఉన్న అన్నామలై.. ఇటీవల అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. కొత్త అధ్యక్షుడి కోసం జల్లెడ పట్టి కూటమి బలపడాలంటే నాగేంద్రనే కరెక్ట్ అని భావించిన బీజేపీ హైకమాండ్ అతడి వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.
నాగేంద్రన్.. గతంలో అన్నాడీఎంకేలో కీలక పాత్ర వహించారు. జయలలిత మరణం తర్వాత 2016లో అన్నాడీఎంకేను విడిచిపెట్టి బీజేపీలో చేరిన ఆయన 2021లో బీజేపీ-అన్నాడీఎంకే కూటమిలో భాగంగా తిరునల్వేలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అన్నాడీఎంకేతో నాగేంద్రన్ కు మంచి సంబంధాలున్నందున కూటమి బలపడుతుందని బీజేపీ భావిస్తోంది.