లోక్ సభ ఎన్నికల వేళ ఓవైపు పార్టీలన్నీ ప్రచారంలో బిజీగా ఉంటే మరోవైపు ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇంకోవైపు ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కాస్త వినూత్నంగా ఓటర్లకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
తొలివిడతలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఓటరు చైతన్యానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సత్యప్రద సాహు పాట పాడారు. తొలిసారి ఓటు వేస్తున్న యువతలో చైతన్యం కలిగి, తప్పనిసరిగా ఓటుహక్కు వినియోగించుకునేలా తానే స్వయంగా స్టూడియోకు వెళ్లి పాట పాడారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఆ రాష్ట్రంలో తొలిసారి ఓటు వేస్తున్న 18-19 ఏళ్ల వయసువారు 5.26 లక్షలమంది ఉండగా, తాజాగా ఓటు నమోదు చేసుకున్న 20-29 ఏళ్ల మధ్యవారు 3.1 లక్షలమంది ఉన్నారు. వీరందరికీ ఓటుహక్కు ప్రాధాన్యం తెలియజేసేలా తన పాటలో కీలక విషయాలను సీఈవో వివరించారు. తమిళంలో పాడిన ఈ పాట బాగా వైరల్ అవుతోంది.