తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ సోమవారం రోజున రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను తాజాగా గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన సిఫారసు ఆధారంగా రాజీనామాను ఆమోదించినట్లు రాజ్భవన్ ఓ ప్రకటన జారీ చేసింది. రాజీనామా ముందు వరకు పోర్టుఫోలియో లేని మంత్రిగా 230 రోజులకు పైగా బాలాజీ పని చేశారు. అంతకుముందు విద్యుత్, ప్రొహిబిషన్ శాఖల బాధ్యతలు చూసుకున్నారు. గతేడాది మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన సెంథిల్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.
అసలు కేసు ఏంటంటే.. 2011- 2015 ఏఐడీఎమ్కే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత బాలాజీ డీఎమ్కేలో చేరారు. గతంలో రవాణా శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేశారనే (ఉద్యోగాల స్కామ్)ఆరోపణలపై మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు గత ఏడాది జూన్ 14న అరెస్టు చేశారు. ఆ తర్వాత ఎంకే స్టాలిన్ ప్రభుత్వం కూడా ఆయన్ను పదవి నుంచి తీసేయలేదు. ఎలాంటి పోర్ట్‌ఫోలియో లేకుండా ఇన్నిరోజులు మంత్రిగా కొనసాగిన బాలాజీ తాజాగా రాజీనామా చేశారు.