రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. పుదుచ్చేరి ఇన్‌ఛార్జి ఎల్జీగా ఉన్న తమిళిసై ఆ ప్రాంతంలో పోటీ చేయడంపైనే గురిపెట్టినట్లు సమాచారం. పుదుచ్చేరి ఇన్‌ఛార్జ్ ఎల్జీగా అక్కడ పలు కార్యక్రమాల్లో ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతూ.. స్థానికంగా తనకు పలుకుబడి ఉండటంతో అక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వద్ద ఈ విషయం ప్రస్తావించినట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అయితే పుదుచ్చేరిలో కూటమి పార్టీ మద్దతుతో ఉన్నామని, పోటీకి అక్కడి అధ్యక్షుడి ఆమోదం కావాలని అమిత్ షా తమిళిసైకి చెప్పినట్లు సమాచారం. తిరిగొచ్చిన తమిళిసై ముఖ్యమంత్రి రంగస్వామితో పుదుచ్చేరి నియోజకవర్గం కేటాయింపుపై చర్చించేందుకు యత్నిస్తుండగా ఆయన తప్పించుకు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె తిరిగి తమిళనాడు నుంచే పోటీ చేస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమిళనాడులోని తూత్తుకుడి లేక విరుదునగర్ నుంచి పోటీ చేయనున్నారని సమాచారం.