జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడిలో దాదాపు 28 మంది ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ – పాక్ బోర్డర్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది. దీంతో భారత సైన్యం కూడా అందుకు తగ్గట్టుగానే ధీటుగా జవాబు చెబుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని మీడియాకి, సోషల్ మీడియా యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.
పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేల రక్షణపరంగా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుంది. వాటిని కవరేజ్ విషయంలో మీడియా అత్యుత్సాహం చూపించవద్దని సూచించింది. రక్షణ చర్యలను లైవ్ కవరేజ్ చేయవద్దని తెలిపింది. మీడియాకు పలు సూచనలు చేస్తూ కేంద్ర సమాచార ప్రసార శాఖ ఓ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. “జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా ప్లాట్ ఫామ్స్, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు రక్షణ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం చేయకూడదు” అని పేర్కొంది.