మణిపూర్ హింస కేసులో మైతేయిలకు చుక్కెదురైంది. మైతిలు దాఖలు చేసిన పిటిషన్ ని తిరస్కరించింది సుప్రీంకోర్టు. మణిపూర్‌లో జరుగుతున్న హింస జాతి హింస కాదని.. మయన్మార్ నుంచి వస్తున్న సాయుధ కుకీ ఉగ్రవాదుల మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించినదని పేర్కొంటూ మైతేయీ కమ్యూనిటీకి చెందిన ఒక సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.
మణిపూర్‌లో అక్రమంగా నల్లమందు సాగు చేయడం వల్ల జాతి హింస చోటుచేసుకుంటోందని.. మయన్మార్ నుంచి నిత్యం సరిహద్దులు దాటుతున్న కుకీ ఉగ్రవాదులు ఆయుధ బలంతో అక్రమంగా నల్లమందు సాగు చేయాలనుకుంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‍ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వాస్తవాలను జోడించి పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు హితవు పలికింది. ఒక తెగను ఉగ్రవాదులుగా సంబోధించడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.