ఇటీవలే ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది నక్సల్స్ మరణించిన విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టులకు మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం రోజున ఉదయం అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది నక్సల్స్ మరణించగా అందులో ఇప్పటివరకూ ఎనిమిది మందిని గుర్తించారు.
వారిలో ముగ్గురు తెలంగాణ వాసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరణించిన నక్సల్స్లో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జియ్యారం గ్రామానికి చెందిన జోగన్న అలియాస్ ఝిస్సు అలియాస్ చీమల నర్సయ్య (66), మంచిర్యాల జిల్లాకు చెందిన వినయ్ అలియాస్ కేశబోయిన అలియాస్ రవి (55), వరంగల్‌కు చెందిన సుష్మిత అలియాస్ చైతె (26) ఉన్నట్లు గుర్తించారు.
వీరు చాలాకాలంగా ఛత్తీస్‌గఢ్‌లో పని చేస్తున్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్న జోగన్నపై 196 కేసులు ఉండగా ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. డివిజనల్ కమిటీ సభ్యుడైన రవిపై రూ.8 లక్షలు, పార్టీ సభ్యురాలైన తిక్క సుష్మితపై రూ.2 లక్షల రివార్డు ఉంది.