వాతావరణ మార్పుల వల్ల భూమి వేడెక్కడంతో ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు, కుండపోత వర్షాలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పిడుగుపాటు మరణాలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఒక్క ఉత్తర్‌ప్రదేశ్‌లోనే పిడుగుపాట్ల వల్ల 43మంది మరణించగా, శుక్రవారం బిహార్‌లో 21 మంది చనిపోయారు. వీరంతా పొలాల్లో నాట్లు వేస్తూనో, పశువులను మేపుతూనో, వర్షానికి చెట్ల కింద తలదాచుకోవడం వల్లనో పిడుగుపాటుకు గురయ్యారు.
వాతావరణ మార్పుల వల్ల భారత్‌తోపాటు ప్రపంచమంతటా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన తుపానులు ఎక్కువ అవుతున్నాయని కేంద్ర భూవిజ్ఞాన శాస్త్ర శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ నాయర్ రాజీవన్ తెలిపారు. భూ ఉష్ణోగ్రత ఒక్క డిగ్రీ సెల్సియస్ మేర పెరిగితే గాలికి తేమదనాన్ని పీల్చుకునే శక్తి 7 శాతం పెరిగి పిడుగుపాట్ల ముప్పు 12 శాతం పెరుగుతుందని వెల్లడించారు. వర్షాకాలంలో మేఘాలు కమ్ముకొంటున్నప్పుడు బయట ఉన్న ప్రజలు వెంటనే పక్కా ఇల్లు లేక భవనంలోనో, తలుపులు మూసిన వాహనంలోనో తలదాచుకోవాలని సూచించారు.