సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్ట్రాగ్రామ్లో రీల్స్తో గుర్తింపు పొందిన ఓ యువతి వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ అవగాహన వీడియోలు చేయడం షురూ చేసింది. అయితే చివరకు అవే ప్రాణాలు తీశాయి. కుంభే జలపాతం వద్ద రీల్ చేస్తుండగా జారిపడి ఈ యువ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాలు కోల్పోయింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ముంబయిలో నివాసముంటున్న ఆన్వీ కామ్‌దార్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందింది. ఏడుగురు మిత్రులతో కలిసి మంగళవారం రోజున మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ సమీపంలో ఉన్న కుంభే జలపాతాన్ని సందర్శించి జలపాతాల సోయగాన్ని రీల్‌లో రికార్డు చేద్దామని ఓ లోయకు అంచున నిలబడి వీడియో చిత్రీకరిస్తుండగా.. ప్రమాదవశాత్తు జారి అందులో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఆరు గంటల పాటు శ్రమించి ఆమెను వారు బయటకు తీసుకొచ్చారు. కానీ, తీవ్ర గాయాలు కావటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఆన్వీకి ఇన్‌స్టాలో 2.56 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె చేసిన పోస్ట్‌లకు మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉన్నాయి.