త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. మొత్తం 60 స్థానాలకు 259 మంది బరిలో ఉన్నారు. త్రిపురలో 28లక్షల 13 వేల మంది ఓటర్లు ఉండగా 3,337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిలో 1,100 కేంద్రాలను సున్నితమైనవిగా 28 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు తెల్లవారుజామునే కొందరు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. మరోవైపు చలిగా ఉండటం వల్ల ఇప్పటికీ పలు పోలింగ్ కేంద్రాల్లో ఒక్క ఓటరు కూడా రాలేదు. పటిష్ఠ బందోబస్తు నడుమ ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-ఐపీఎఫ్టీతో కలిసి పోటీ చేస్తోంది. మరోవైపు సీపీఎం-కాంగ్రెస్తో జట్టు కట్టి బరిలోకి దిగింది. తిప్రా మోతా పార్టీ సొంతంగానే ఎన్నికల క్షేత్రంలో నిలిచింది. ఈ ఎన్నికల కోసం 31 వేల మంది పోలింగ్ సిబ్బంది, 25వేల మంది కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు.