దేశ విదేశ పర్యాటకులతో నిత్యం బిజీబిజీగా ఉండే గోవా ఒక్కసారిగా వణికిపోయింది. ప్రజలంతా ప్రాణాలు అరచేత పట్టుకుని కూర్చుకున్నారు. సునామీ రాబోతోందన్న వార్తతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. అసలేం జరిగిందంటే..?
సునామీ రానున్నట్లు రాత్రి పూట సైరన్ మోగడంతో గోవా తీరప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గోవా రాజధాని పణజీ సమీపంలోని పోర్వోరిమ్ ప్రాంతంలో ఉన్న కొండపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది సునామీ వచ్చే విపత్తును పసిగట్టి సైరన్ ద్వారా హెచ్చరిస్తుంది. గురువారం రాత్రి 9 గంటల తర్వాత ఒక్కసారిగా సైరన్ మోగింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
దాదాపు 20 నిమిషాలపాటు సైరన్ మోగుతూనే ఉంది. దీంతో మాక్‌డ్రిల్‌లో భాగంగా దాన్ని మోగించి ఉంటారని భావించారు. సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే సైరన్ మోగినట్లు భావిస్తున్నామని ఉత్తర గోవా జిల్లా కలెక్టర్ మము హేగే తెలిపారు. ఏది ఏమైనా సైరన్ మోగడంతోనే తమ గుండెల్లో రైలు పరిగెట్టినంత పనైందని ప్రజలు అన్నారు.