రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం పరోక్షంగా అన్ని దేశాలపై పడుతోంది. యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 40 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 140 డాలర్లకు చేరింది. దీంతో అన్ని దేశాలపై ప్రభావం పడుతోంది ముఖ్యంగా ఇండియా వంటి అతిపెద్ద దేశంపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటోంది. తాజాగా ఇండియాలో టోకు విక్రయదారులకు అమ్మె డిజిల్ ధరను లీటర్ కు రూ.25 పెంచారు. ఈమేరకు దేశంలోని ప్రధాన చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ప్రస్తుతం టోకు ధర పెంచినా.. సామాన్యుడికి అందుబాటులో ఉండే రిటైల్ ధరలో మార్పులు లేవు.
ఇదిలా ఉంటే పెట్రోల్ ధర కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. బల్క్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 25 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో సామాన్యుడిపై కూడా ఈ భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు చుక్కలను అంటుతున్నాయి. యుద్ధ ప్రభావం వల్ల ఉక్రెయిన్ నుంచి సన్ ఫ్లవర్ దిగుమతులు తగ్గిపోయాయి. దీంతో నూనెల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.