పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనలో పది మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారేమోననే అనుమానంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి గార్డెన్ రీచ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం కూలింది. భవనంలో ఎవరూ లేరని స్థానికులు చెప్పారు. కానీ, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న గుడిసెలపై శిథిలాలు పడ్డాయి. వాటిలో ఎవరైనా ఉండే అవకాశం ఉంది. ఇంకా పదుల సంఖ్యలో శిథిలాల్లో చిక్కుకొని ఉంటారని అనుమానంగా ఉంది. వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాం. అంబులెన్సులను సిద్ధంగా ఉంచాం.’ అని నగర సీపీ వినీత్ గోయల్ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై బీజేపీ నేత సువేందు అధికారి స్పందిస్తూ కావాల్సిన సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.