ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ షురూ.. ఓటేసిన మోదీ

-

భారత 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూమ్ నెం.63లో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంపీలు ఓటేసేందుకు పోటెత్తారు.

పోలింగ్‌ ముగిసిన వెంటనే కౌంటింగ్‌ మొదలుపెట్టి రాత్రికల్లా ఫలితం వెల్లడిస్తారు. లోక్​సభ సెక్రెటరీ జనరల్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ సాగుతుంది. ఎన్డీయే కూటమి తరఫున బంగాల్‌ మాజీ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌(71), విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి, గవర్నర్‌ మార్గరెట్‌ ఆళ్వా (80) ఉపరాష్ట్రపతి బరిలో ఉన్నారు.

ఈ ఎన్నికకు సంబంధించి.. లోక్‌సభకు చెందిన 543, రాజ్యసభకు చెందిన 245 మంది ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో జమ్మూకశ్మీర్‌ నుంచి 4, త్రిపుర నుంచి 1, నామినేటెడ్‌ సభ్యులనుంచి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే నికరంగా 780 మందికి ఓటు వేసే హక్కు ఉంది. ఇందులో లోక్‌సభలో 23, రాజ్యసభలో 13 మంది సభ్యుల సంఖ్యాబలం ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినందున ఆ పార్టీకి చెందిన 36 మంది సభ్యులు మినహాయించి మిగిలిన 744 మంది ఓటింగ్‌లో పాల్గొనడానికి అవకాశం ఉంది.

ఈనెల 10తో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. కొత్త ఉపరాష్ట్రపతి ఈనెల 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ రోజు రాఖీపౌర్ణమి సెలవురోజైనప్పటికీ యథావిధిగా ఆ కార్యక్రమం కొనసాగనుంది. 12వ తేదీవరకు పార్లమెంటు జరుగనున్నందున చివరి రోజు కొత్త ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌హోదాలో సభను నిర్వహించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version