చంద్రయాన్‌-3 నుంచి విడిపోయిన ‘విక్రమ్‌’.. కీలక ఘట్టం పూర్తి

-

జాబిల్లిపై అడుగుపెట్టడమే లక్ష్యంగా నింగిలోకి దూసుకెళ్లింది భారత వ్యోమనౌక చంద్రయాన్-3. గత కొన్నిరోజులుగా రోజుకో కీలక ఘట్టాన్ని దాటుతూ ముందుకెళ్తున్న.. చంద్రయాన్-3 తాజాగా మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. గురువారం ఈ చంద్రయాన్-3లోని ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ ‘విక్రమ్‌’ విజయవంతంగా విడిపోయింది. చంద్రుడి ఉపరితలంపై దిగే కీలక ఘట్టానికి ఇది సిద్ధమైంది. నేటి నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ సొంతంగా చంద్రుడిని చుట్టేస్తుంది.

‘చంద్రయాన్‌-3’ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా ఇస్రో విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మరుసటిరోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు. 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పొడిగించారు.

బుధవారమే చంద్రయాన్‌-3 చివరి దశ కక్ష్యలోకి ప్రవేశించగా.. నేడు ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయింది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటల సమయంలో ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో (ISRO) వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news