ఎంతో ఆహ్లాదకరమైన కేరళలోని వయనాడ్ జిల్లా భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియలతో.. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజల ఆర్తనాదాలతో తల్లడిల్లుతోంది. ప్రకృతి ప్రకోపానికి గురై వయనాడ్ లో విధ్వంసం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో 93 మంది మరణించారు. వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్‌మల ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ ఘోర విపత్తులో మరో 116 మంది గాయపడినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ వెల్లడించింది.
మరోవైపు సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. భారీగా వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఓవైపు సహాయక చర్యలు చేపడుతుంటే.. ముండకైలో ఈ మధ్యాహ్నం మరోసారి కొండచరియలు విరిగిపడినట్లు సమాచారం. దీనివల్ల పకడ్బందీగా చర్యలు చేపట్టాల్సి వచ్చి మరింత జాప్యం జరుగుతోంది. మరోవైపు వరద, బురద ప్రవాహంతో వందల మంది కొట్టుకుపోయినట్లు సమాచారం. వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలింపు చేపడుతున్నారు. డ్రోన్లు, జాగిలాలతో అన్వేషణ సాగిస్తున్నారు.