“ఇల్లు మొత్తం పోయింది. మా వాళ్లు ఎక్కడ ఉన్నారో అర్థం కావడంలేదు. ఎవరో ఒకరు వచ్చి సాయం చేయండి’’. “నా భార్య ఆచూకీ కనిపించడం లేదు ప్లీజ్ వెతికిపెట్టండి”. వయనాడ్‌లో కొండచరియలు విరిగి పడిన ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న కొందరు బాధితులకు ఇలా తమ ఆత్మీయులకు ఫోన్ కాల్ చేసి కాపాడాలని కోరుకుంటున్నారు. ప్రకృతి విలయానికి గురైన వయనాడ్ నుంచి ఇలాంటి విషాదకర కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన కొంతమంది తమ ఆత్మీయులకు ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్న ఫోన్ సంభాషణలను స్థానిక టీవీలు ప్రసారం చేస్తున్నాయి. ఈ దృశ్యాలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి.
మరోవైపు ముండకైలో భారీగా ప్రజలు బురదలో కూరుకుపోయి విలవిల్లాడుతున్నారని పేర్కొంటూ తమకు ఫోన్‌కాల్ వచ్చిందని ఓ వ్యక్తి వెల్లడించాడు. వయనాడ్‌లో కొండచరియలు, బురద విరుచుకుపడిన ఘటనలో ఇప్పటివరకు 50 మంది మరణించగా.. 70 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో సహాయక బృందాలు ముందుకువెళ్లలేని పరిస్థితి నెలకొంది.