రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి షురూ అయింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం సాగిస్తున్నాయి. అయితే ఈ రాష్ట్ర ఎన్నికల్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేపై స్వయంగా ఆయన భార్యే పోటీకి దిగుతోంది. ఇప్పుడు ఈ విషయం ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలు ఈ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..?
రాజస్థాన్‌లోని దాంతా రామ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో భార్యాభర్తలిద్దరూ పరస్పరం ప్రత్యర్థులుగా తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేంద్ర సింగ్ కాంగ్రెస్ పార్టీ నేత. ప్రస్తుతం దాంతా రామ్‌గఢ్‌లో ఆయనే మళ్లీ బరిలో నిలిచే అవకాశాలు ఉండగా.. వీరేంద్రకు ఇంట్లో నుంచే పోటీ ఎదురవనున్నట్లు తెలిసింది. అతడి భార్య రీటా చౌధరీ ప్రస్తుతం జననాయక్ జనతా పార్టీ(జేజేపీ)లో ఉన్నారు. దాంతా రామ్‌గఢ్‌లో తమ అభ్యర్థిగా రీటాను జేజేపీ ప్రకటించింది.
మరోవైపు తన భర్తపై పోటీ గురించి ఆమెను ప్రశ్నించగా.. కాంగ్రెస్‌లో ఆయనకు ఇంకా టికెట్ ఖరారు కాలేదు కాబట్టి దానిపై ఇప్పుడే మాట్లాడబోనని తెలిపారు. మరోవైపు- వీరేంద్ర సింగ్ మాత్రం ఈ ఎన్నికల్లో తనకు, తన భార్యకు మధ్య ప్రత్యక్ష పోరు ఉంటుందని తెలపడం గమనార్హం.