కారుని టచ్ చేశాడని ఆరేళ్ల బాలుడిపై యువకుడి దాడి

-

సాధారణంగా అబ్బాయిలకు కార్లంటే భలే మోజు. వారు తల్లిదండ్రులను, గర్ల్​ఫ్రెండ్​ని ఎలా చూసుకుంటారో కానీ కారుని మాత్రం కన్నబిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటారు. కాస్త గీత పడినా తల్లడిల్లిపోతుంటారు. ఇక ఆ గీత పడేసిన వారిపై నిప్పులు చెరుగుతుంటారు. కొన్నిసార్లు ఇది శ్రుతి మించుతుంది కూడా. అలాంటి ఘటనే కేరళలోని కన్నూరు జిల్లా థాలాస్సెరీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

రాజస్థాన్‌ నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన ఆరేళ్ల బాలుడిపై మహమ్మద్‌ షెహజాద్‌ (20) అనే యువకుడు పైశాచిక దాడికి దిగి, కాలితో తన్నుతూ తీవ్రంగా గాయపరిచాడు. పార్కింగులో ఉన్న షెహజాద్‌ కారు వద్ద ఆడుకొంటూ దానిపై వాలాడు ఆ బాలుడు. అంతే ఆ పసివాడిపై షెహజాద్ విరుచుకుపడ్డాడు. దీనికి సంబంధించి సీసీ టీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పలువురు మంత్రులు, విపక్ష నేతలు స్పందించారు.

స్థానికులు కొందరు మొదట ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువచ్చినా స్పందించని పోలీసులు.. ఏఎస్పీ నితిన్‌ రాజ్‌ చొరవతో నిందితుణ్ని అరెస్టు చేశారు. గాయపడిన బాలుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మహిళా శిశు అభివృద్ధి విభాగం బాలుడి కుటుంబానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. తక్షణం స్పందించని స్థానిక పోలీసుల తీరుపై విపక్ష నేతలు మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news