ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో గురించి తెలియని వారుండరు. కస్టమర్లను తనదైన శైలిలో ఎంటర్టైన్ చేయడమే గాక ఆకట్టుకునే డిస్కౌంట్లు, ఆఫర్లతో వారిని ఆకర్షిస్తోంది. అయితే తాజాగా ఈ సంస్థ తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. 500 మందికిపైగా ఉద్యోగుల్ని తొలగించింది. నియామకం చేపట్టిన ఏడాదిలోపే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్‌గా విధులు నిర్వర్తిస్తున్న వారిని ఇంటికి పంపించేసినట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఏడాది క్రితం జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ పేరిట ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ నియామకాలు చేపట్టి కస్టమర్ సపోర్ట్ విభాగం కింద 1500 మందిని విధుల్లోకి తీసుకుంది. అయితే వీరిలో చాలా మందిని పనితీరు బాగా లేకపోవడం, సమయపాలన పాటించని కారణంగా నోటీస్ పీరియడ్ ఇవ్వకుండానే ఇంటికి పంపింది. అయితే వారికి ఒక నెల జీతాన్ని పరిహారంగా ఇచ్చినట్లు సమాచారం. అయితే స్పష్టమైన వివరణ లేకుండా ఇంటికి పంపారని, అకస్మాత్తుగా ఉద్యోగం నుంచి తొలగించడంతో ఏం చేయాలో పాలు పోవడం లేదని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు.