‘ఆర్ఆర్ఆర్’ లో నాటు నాటు సాంగ్ ఎంత పాపులర్ అయిందో.. రఘురామ కృష్ణంరాజు రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంతే పాపులర్ అయిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు బాధ్యతలు చేపట్టిన తరువాత అసెంబ్లీలో మాట్లాడారు. రఘురామకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. తెలుగు బిడ్డగా పంచెకట్టులో వచ్చిన రఘురామ.. స్పీకర్ స్థానానికి నిండుదనం తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. కొత్త బాధ్యతలో రఘురామను చూస్తుంటే సంతోషం కలుగుతుందన్నారు.
ముఖ్యంగా పోలీస్ కస్టడీలో ఉన్న అధికార ఎంపీపై దాడి చేయడం దారుణమన్నారు. ఒకే రోజు ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, అరెస్ట్ మూడు జరిగాయి. శుక్రవారం అరెస్ట్ చేస్తే.. కోర్టు ఉండదు కాబట్టి జైలులో పెట్టవచ్చని కుట్ర చేశారు. లాఠీలు, రబ్బర్ బెల్టులతో అరికాళ్లపై కొట్టారు. కొట్టినట్టు కోర్టులో చెబితే కస్టడీకి వచ్చినప్పుడు చంపేస్తామని బెదిరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు పంపి వైద్య పరీక్షలు చేయాలని కోర్టు చెప్పింది. ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెల్లకుండా నివేదికను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. రఘురామ ఎంపీగా పని చేసిన ఐదేళ్లలో నియోజకవర్గానికి రానియ్యకపోతే.. రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారని తెలిపారు.