నేపాల్ విమాన ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే 31 మృతదేహాలను వెలికి తీసి ఆస్పత్రికి తరలించిన సహాయక సిబ్బంది.. తాజాగా మరో 37 మృతదేహాలను బయటకి తీశారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 68కి చేరింది. ఈ మేరకు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది. మిగిలిన నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ప్రమాద స్థలంలో మంటలు అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు కొనసాగించడం కష్టతరమైంది. ఒకవైపు మంటలను అదుపు చేస్తూనే.. మృతదేహాలను బయటకు తీస్తున్నారు. 68 మంది ప్రయాణికులతోపాటు ఐదుగురు సిబ్బందితో మొత్తం 72 మందితో యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్ 72 విమానం కాఠ్‌మాండూ నుంచి పొఖారాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు చిన్నారులతో సహా 15 మంది విదేశీయులు ఉన్నట్లు నేపాల్ పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. 53 మంది నేపాలీ దేశీయులు, ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు కొరియన్లు, అర్జెంటీనా, ఐర్లాండ్,ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌కు చెందిన ఒక్కో ప్రయాణికుడు ఉన్నట్లు యతి ఎయిర్‌లైన్స్ ప్రకటన విడుదల చేసింది.