పుల్వామా దాడిపై సానియా మీర్జా లేఖ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు..

-

పుల్వామాలో భార‌త జ‌వాన్ల‌పై పాక్ ఉగ్ర‌వాదులు జ‌రిపిన మార‌ణ కాండ‌ను మనం ఇంకా మ‌రిచిపోలేదు. అందుక‌నే దేశ వ్యాప్తంగా ఇప్ప‌టికీ నిర‌స‌న‌లు మిన్నంటుతున్నాయి. పాక్ ఉగ్ర‌వాదుల ఆగ‌డాల‌ను అరిక‌ట్టాల్సిందేన‌ని, పాకిస్థాన్‌ను అణ‌చివేయాల్సిందేనని దేశ వ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే మ‌రోవైపు.. పాక్ ఆటగాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇండియ‌న్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై కూడా భార‌త అభిమానులు మండి ప‌డుతున్నారు. ఎందుకంటే…

పుల్వామాలో పాక్ ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడిని ఖండిస్తూ, భార‌త అమ‌ర జవాన్ల‌కు నివాళుల‌ర్పిస్తూ, వారి కుటుంబాల‌కు సహాయం చేస్తూ.. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా అనేక మంది సెల‌బ్రిటీలు స్పందించారు. ఈ మేర‌కు కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే అంద‌రు సెల‌బ్రిటీల‌లాగే భార‌త టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ట్విట్ట‌ర్‌లో పోస్టు పెట్టింది. అయితే ఆ పోస్టు పెట్టిన‌ప్ప‌టికీ సానియాపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

”సెల‌బ్రిటీలు ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను ఖండించాల్సిందేనా ? వాటిపై సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టాలా ? అలా చేస్తేనే దేశ భ‌క్తిని చాటుకున్న‌ట్లు అవుతుందా ? లేదంటే దేశ భ‌క్తి లేన‌ట్లేనా ? నేను నా దేశం కోసం ఆడుతా, చెమ‌ట చిందిస్తా, దేశానికి సేవ చేస్తా. చ‌నిపోయిన జ‌వాన్ల కుటుంబాల‌కు స‌హాయం చేస్తా. వారు నిజ‌మైన హీరోలు. ఫిబ్ర‌వ‌రి 14 భార‌త్‌కు బ్లాక్ డే. మ‌ళ్లీ ఇలాంటి రోజు మ‌న‌కు రాకూడ‌దు. సోష‌ల్ మీడియాలో కొంద‌రు సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటారు. అలాంటి వారికి వేరే ఏ ప‌ని ఉండ‌దు. ఈ ప్ర‌పంచంలో ఉగ్ర‌వాదుల‌కు చోటు లేదు. సెల‌బ్రిటీల‌ను విమర్శించ‌డం కాదు, దేశానికి ఏదో ఒక విధంగా సేవ చేయండి..” అంటూ సానియా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ భారీ లేఖ‌ను పోస్ట్ చేసింది.

అయితే ఈ లెట‌ర్ బాగానే ఉంది కానీ అందులో ఎక్క‌డా పాకిస్థాన్ అనే ప‌దాన్ని సానియా మీర్జా వాడ‌లేదు. దీంతో ఇప్పుడు నెటిజ‌న్లు సానియాను విమ‌ర్శిస్తున్నారు. ”పాకిస్థాన్ అన్న ప‌ద‌మే లేకుండా లెట‌ర్ రాశావు, ఆ ప‌దం రాయ‌డానికి నీకు మ‌న‌స్సు రాలేదా, పాకిస్థాన్ వ‌ల్లే క‌దా మ‌న‌కు ఇన్ని బాధ‌లు..” అంటూ నెటిజ‌న్లు సానియాపై మండిప‌డుతున్నారు. మ‌రి దీనిపై సానియా మీర్జా ఎలా స్పందిస్తుందో వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news