భారత్ లో జనాభా రోజు రోజుకి పెరిగిపోతుంది. రాబోయే 20 ఏళ్ళల్లో భారత జనాభా 150 కోట్లకు కూడా వెళ్లే అవకాశం ఉందని పరిశోధకులు చెప్తున్నారు. దీనితో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో జనాభా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక అక్కడ సొంత వాహనాలు వాడే వారి సంఖ్య తక్కువై, టాక్సీ వాడకం క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీనితో అనేక టాక్సీ కంపెనీలు తమ సర్వీసులను ఎక్కువగా పెంచేస్తున్నాయి. జనం కూడా ప్రభుత్వ సర్వీసుల కంటే వీటి మీదే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
సర్వీసులు కూడా ఎక్కువ కావడంతో ధరలు కూడా అందరికి అందుబాటులో ఉంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి కూడా పెరగడంతో టాక్సీ సర్వీసులు కూడా ఎక్కువైపోయాయి. ఇప్పుడు నిరుద్యోగులకు ఇదే వరమని అంటున్నారు పలువురు. ఆ వ్యాపారంలోకి దిగమని సూచిస్తున్నారు. పెరుగుతున్న నగరీకరణ, ప్రయాణాల మూలంగా ఈ వ్యాపారం ఊపందుకుంటోందని అంటున్నారు. ఇతర వ్యాపారాల్లో ఉన్న వారు కూడా దీనిపై ఆసక్తి చూపించి టాక్సీ సర్వీస్ లోకి దిగి వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
మీకు సొంత వాహనం ఉంటే ఈ వ్యాపారాన్ని పెట్టుబడి లేకుండానే మొదలుపెట్టవచ్చని పలువురు సూచిస్తున్నారు. మీరున్న ప్రాంతంలోనే ఈ సర్వీసుని విజయవంతంగా అమలు చేయవచ్చని, దానికి పరిచయాలు పెంచుకోవడమే పెట్టుబడి అని సూచిస్తున్నారు. ఇక సోషల్ మీడియాను కూడా దీనికి ఎక్కువగా వాడుకోవచ్చని, అలాగే మీకు ఎక్కువ ప్రదేశాలు తెలియాలని, వాటి మీద మీకున్న అవగాహనను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజల్లోకి తీసుకువెళ్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇప్పుడు జనం ఎక్కువగా పర్యాటకం మీద ఆసక్తి చూపిస్తున్నారని, దాని మీద దృష్టి సారిస్తే మంచి లాభాలు ఉంటాయని అంటున్నారు.