చేతులు కాలాక అయినా.. ఆకులు సరిగా పట్టుకోక పోతే ఎలా బాబూ!- ఇప్పుడు టీడీపీ సీనియర్లలో వినిపిస్తున్న మాట ఇదే! తాజాగా చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సంస్థాగత పదవుల్లో యువతకు 33% కోటాను అమలు చేస్తామని అంటున్నారు. వాస్తవానికి ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వారు చాలా మంది వృద్ధులై పోయారు. దీంతో వారిని రీప్లేస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే, ఇప్పటి వరకు తన హవాతోనే నెట్టుకొచ్చిన పార్టీని ఇక, తన తనయుడి చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
తాజాగా యువతకు ప్రాధాన్యం పెంచారు. అయితే, యువత అంటే.. కేవలం ఓ సామాజికవార్గానికి ముఖ్యంగా తన సామాజికవర్గా నికి చెందన వారేనా? లేక వారసుల బిడ్డలేనా? అనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వద్దామని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే సీనియర్లు బాబు వ్యూహాలకు పక్క చూపులు చూస్తున్నారు. ఈ సునామీని తట్టుకోవడం కంటే.. యువతకు అప్పగించి.. తాను తప్పుకోవడం మంచిదనే వ్యూహంతోనే చంద్రబాబు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.
అయితే, ఈ విషయంలో అందరూ అనుకుంటున్నట్టు.. యువత అంటే.. అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారుగా కాకుండా.. కేవలం ఓ వర్గానికి చెందిన వారిగానే బాబు పరిగణిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. తాజాగా అమరావతిలో చంద్రబాబు పార్టీలోని యువతతో భేటీ అయ్యారు. అయితే, ఈ భేటీకి కేవలం ఓ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారే హాజరయ్యారు. కాదు కాదు.. వారికే ఆహ్వానాలు అందినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇన్నాళ్లుగా తాము పార్టీ కోసం కృషి చేయలేదా? అని ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాలకు చెందిన యువత ప్రశ్నిస్తోంది.
వారికి కూడా ప్రాధాన్యం దక్కాల్సిన అవసరం లేదా ? అనేది వారికి ఆవేదన. ఆందోళన కూడా. అదే సమయంలో తన కుమారుడు లోకేష్‌కు త్వరలోనే కార్యాచరణ అధ్యక్ష పదవి ఇవ్వనున్నారనేదివాస్తవం. దీనిలో భాగంగానే ఆయనను బలపరిచేందుకు సీనియర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడితే.. యువతతో మేనేజ్ చేసేయొచ్చనే ఆలోచన కూడా బాబు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం మొత్తంగా టీడీపీలో చీలిక తెచ్చే ప్రమాదంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.