వాట్సప్.. ఇప్పడు చాలా మంది రోజులో ఒక్కసారైనా దీన్ని చూడకుండా ఉండలేరు.. ఒకటా రెండా అనేక గ్రూపులు.. అన్నింట్లోనూ అప్ డేట్ గా ఉండాలి.. మళ్లీ స్టేటస్ లు చెక్ చేసుకోవాలి.. కొత్త స్టేటస్ లు పెట్టుకోవాలి.. అబ్బో జనం వాట్సప్ కు ఎంతగా కనెక్టయిపోయారో..
అలాంటి వాట్సప్ ఇప్పుడు కొత్త సేవల రంగంలోకి ప్రవేశిస్తోందట. ఫొటోలు, వీడియోలు, సందేశాలు పంపించుకోవడంతో పాటు కాల్స్ చేసుకునే సదుపాయం కూడా ప్రస్తుతం వాట్సప్ కల్పిస్తోంది. ఇప్పుడు వీటికి తోడు.. పేమెంట్స్ సేవల్లోకీ అడుగు పెడుతుందట. అంటే ఇకపై మీరు వాట్సప్ ద్వారానే బిల్లులు చెల్లించుకోవచ్చు.
మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.. ఇప్పటికే పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్.. ఇలా ఎన్నో పే మెంట్స్ సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు వాటి జాబితాలోకి సోషల్ మీడియా దిగ్గజం వాట్సప్ కూడా వస్తుందటన్నమాట. అయితే ఈ పేమెంట్ సేవలు అందించే సంస్థలు డేటాను లోకల్ గా స్థానికంగా నిల్వ చేయాలన్న నిబంధన ఉంది.
ప్రస్తుతం వాట్సప్ ఆ పనిలోనే ఉంది. ఇందు కోసం మరో 2 నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత చెల్లింపుల సేవలను వాట్సాప్ ప్రారంభిస్తుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ సీఈవో దిలీప్ అస్బే తెలిపారు. అయితే వాట్సాప్ చెల్లింపుల సేవలు ప్రారంభించినా, వ్యవస్థలో నగదు చెలామణిపై ప్రభావం చూపేందుకు మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉంటుందంటున్నారాయన.