దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ దళిత యువతి హత్యాచారం కేసు అనేక కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు తమను తాము అమాయకులమని అంటున్నారు. అంతే కాదు ఆమెను చంపింది బాధితురాలి కుటుంబ సభ్యులే అంటూ వారి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ మేరకు హత్రాస్ జిల్లా ఎస్పీ వినీత్ జైశ్వాల్ కు ఆ నలుగురూ లేఖ రాశారు. సదరు యువతితో తమకు స్నేహం ఉండేదని, బాధితురాలితో తరచూ తాము మాట్లాడుతుండే వాళ్లమని నిందితులు తెలిపారు.
ఆ ఘటన జరిగిన రోజు తాను అక్కడే ఉన్నానని, బాధితురాలి తల్లి, సోదరుడు అక్కడికి వచ్చి అభ్యంతరం తెలపడంతో అక్కడి నుంచి వెళ్లి పోయినట్టు ప్రధాన నిందితుడు చెబుతున్నారు. తమ స్నేహం ఇష్టంలేక ఆమె కుటుంబమే ఆమెను హతమార్చిందని ఆ తరువాత మళ్ళీ తమపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిందని ఆరోపిస్తున్నారు. ఇక నిందితుల ఆరోపణలపై బాధితురాలి తండ్రి స్పందిస్తూ తమ కుమార్తెను కోల్పోయిన తమ మీదే నిందితులు తమపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.