తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబంలో తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నాయా ? గాలి వారసులు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా ? ఈ నేపథ్యంలోనే గాలి చిన్న కుమారుడు పక్క చూపులు చూస్తున్నారా ? అంటే ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి రాజకీయాల్లో గాలి వారసుల యుద్ధమే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడుకు తెలుగు రాజకీయాల్లో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో నగరిలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయాక బాబు గాలికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అనంతర పరిణామాల నేపథ్యంలో 2014 ఎన్నికలకు దూరంగా ఉండాలని ముందే నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే తన రాజకీయ వారసుడిగా పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్ కు అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే గాలి రెండో కుమారుడు జగదీశ్ సైతం గాలి వారసత్వం కోసం పట్టుబట్టారు. చివరకు ముద్దుకృష్ణమ పెద్ద కుమారుడికి సపోర్ట్ చేయగా…. ఆయన భార్య సరస్వతమ్మ రెండో కుమారుడికి సపోర్ట్ చేయడంతో గాలి ఉండగానే ఈ కుటుంబంలో విబేధాలు వచ్చాయి. చివరకు గాలి మరణం తర్వాత చంద్రబాబు ఇద్దరి మధ్య సయోధ్య చేసి ఒకరికి ఎమ్మెల్సీ, మరొకరికి నగరి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని అనుకున్నారు.
అయితే ఇద్దరూ పంతానికి పోవడంతో మధ్యేమార్గంగా గాలి భార్య సరస్వతమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈ యేడాది జరిగిన ఎన్నికల్లో నగరి సీటు భానుప్రకాశ్‌కు ఇవ్వగా చిన్న కుమారుడు, తల్లి సహకరించలేదన్న ఆరోపణలు వచ్చాయి. చివరకు భానుప్రకాశ్ రోజా చేతిలో ఓడిపోయారు. ఇక ఇప్పుడు అన్న ఓ దారిలో ఉంటే… తమ్ముడు, తల్లి మరో దారిలో ఉన్నారు. ఇక ప్రస్తుతం భాను టీడీపీలో కొనసాగుతుండగా… జగదీష్ మాత్రం వైసీపీలోకి వెళుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
జగదీశ్ ఇప్పటికే రోజాతో పాటు వైసీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారంటున్నారు. ఆయనకు తన మామ, కర్ణాటక బీజేపీ నేత కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు అండదండలు ఉన్నాయి. ఇక తల్లి సరస్వతమ్మ ఎమ్మెల్సీగా ఉన్న జగదీశే చక్రం తిప్పుతున్నారు. ఏదేమైనా టీడీపీలో ఎంతో పేరు ఉన్న గాలి కుటుంబం ఇప్పుడు ఆయన లేకపోవడంతో నిట్టనిలువునా చీలిపోయింది.