ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమీకరణ, ముష్కరుల కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహణ, నిషేధిత సంస్థల్లో చేరేలా ప్రజల్ని ప్రభావితం చేసేవారిని లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. పీఎఫ్ఐ కార్యాలయాలపై ఎన్ఐఏ ముప్పేట దాడి చేసింది.
ఇప్పటి వరకు ఈ కేసులో 106 మందిని అరెస్టు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారంతో ఎన్ఐఏ పక్కా ప్రణాళికతో ఈ ఆపరేషన్ చేపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ భారీ స్థాయిలో సోదాలు జరపడం, అనేక మందిని అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
11 రాష్ట్రాల్లోని పీఎఫ్ఐ కార్యాలయాలు, నేతల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేసింది ఎన్ఐఏ. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ అరెస్టు చేసింది. ఇలా గురువారం ఒక్కరోజే కేరళలో(22), మహారాష్ట్ర, కర్ణాటకలో 20 చొప్పున, తమిళనాడులో (10), అసోంలో 9, ఉత్తర్ప్రదేశ్లో 8, ఆంధ్రప్రదేశ్లో 5, మధ్యప్రదేశ్లో 4, పుదుచ్చేరి, దిల్లీలో ముగ్గురు చొప్పున, రాజస్థాన్లో ఇద్దరిని ఎన్ఐఏ అరెస్టు చేసింది.
అయితే.. వారి వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించలేదు. పీఎఫ్ఐ స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయి నేతల ఇళ్లల్లో సోదాలు జరిపినట్లు వివరించింది. ఉగ్ర నిధులకు సంబంధించిన కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, రాష్ట్రాల పోలీసులతో కలిసి ఈ అరెస్టులు చేసినట్లు తెలిపింది.