రేపే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ జరుగనుంది. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. కేవలం రెండున్నర గంటల్లో ఫలితం తేలనుంది. ఈ ఎన్నిక కోసం మొత్తం 824 ఓట్లు పోల్ కావాల్సి ఉండగా, ఒకరు మృతి చెందడంతో 823 ఓట్లు పోల్ అయ్యాయి.
రేపు మొదటి రౌండ్ లో 600 ఓట్ల లెక్కించనున్నారు. దీంతో మొదటి రౌండ్ లోనే ఫలితం తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా మొత్తం రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఈ కౌంటింగ్ కు 6 టేబుళ్లు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. లెక్కింపు కేంద్రానికి ఒక్కొ పార్టీ నుంచి 8 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి కి డిపాజిట్ డౌటేనని అంటున్నారు. ఎందుకంటే పోలైన ఓట్లలో ఆరో వంతు వస్తేనే డిపాజిట్ కింద లెక్క, టీఆర్ఎస్ పార్టీకే 80 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉండడంతో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత గెలుపు లాంఛనమే అని అంటున్నారు.